మంత్రి శ్రీనివాస్ గౌడ్పై రేవంత్ రెడ్డి ఫైర్

Update: 2023-07-30 08:40 GMT

అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు గడిచినా సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాను అద్దంలా మారుస్తానన్న హామీని నెరవేర్చలేదని విమర్శించారు. భూకబ్జాలకు పాల్పడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ చివరకు వక్ఫ్ భూములను సైతం వదలడంలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఆలంపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని రేవంత్ మండిపడ్డారు.

తనను ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లు అమ్మి జిల్లాను అభివృద్ధి చేస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడా మాట మర్చిపోయారని రేవంత్ అన్నారు. జిల్లాను అభివృద్ధి చేయలేదుగానీ, తాను మాత్రం వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఓనర్ అయ్యాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, టీవీలు, పేపర్లు వచ్చాయని అన్నారు. ల్యాండ్, సాండ్, మైన్, వైన్ ఇలా ఏ దందాలో చూసినా బీఆర్ఎస్ నేతలే ఉన్నారని రేవంత్ ఆరోపించారు.

పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని రేవంత్ అన్నారు. ఒకవేళ అక్రమ కేసులుపెడితే మిత్తితో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం మహబూబ్ నగర్ జిల్లాలోని 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.




Tags:    

Similar News