అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం - రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రాంనగర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉంటే పెన్షన్ రూ.2 వేలు వస్తుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రూ. 4 వేలు పింఛను ఇస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్కు అధికారమిస్తే ప్రతి మహిళకు నెలనెలా రూ. 2,500 ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ చెప్పారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ను అందజేసి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.