అరెస్ట్ చేసి మా ఉద్యమాన్ని ఆపలేరు.. రేవంత్ రెడ్డి

Update: 2023-06-22 08:36 GMT

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అరెస్టులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ముందస్తు అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాడే హక్కు మాకు ఉందని, ముందస్తుగా అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు(Telangana Dashabdi Utsavalu) వ్యతిరేకంగా ‘దశాబ్ది దగా(Dashabdi Daga)’ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసు శాఖ.. కాంగ్రెస్ నాయకులను రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేస్తోంది. నిరసన కార్యక్రమాలకు హాజరవ్వకుండా ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మరికొందరు నేతలను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహిస్తున్నారు. ప్రజలకు మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే పోలీసు శాఖ తమని నిర్బంధించడం దుర్మార్గమని మండిపడుతున్నారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం. దశాబ్ది ఉత్సవాల పేరిట.. కేసీఆర్(KCR) పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తూన్న విషయం వాస్తవం కాదా అంటూ నిలదీశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీ అయినా పూర్తిగా అమలు చేసారా? కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే మేము ప్రశ్నిస్తున్నామన్నారు రేవంత్. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉంది. ముందస్తు అరెస్టులు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు. మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News