ఐటీ దాడులకు ప్లాన్ అమిత్ షా-కేసీఆర్‌లదే.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందని, బీజేపీ-బీఆర్‌ఎస్‌ల పతనం మొదలైందని అంటున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు రాసిన బహిరంగ లేఖలో.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ నేతలపై IT, ED దాడులు చేయిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను మోదీ, కేసీఆర్ పావులుగా మార్చుకున్నారని అన్నారు. బీజేపీ-బీఆర్‌ఎస్‌లు కుమ్మకు రాజకీయాలతో మభ్యపెట్టాలని చూస్తున్నాయన్నారు. ప్రజల తరఫున పోరాడితే ద్రోహులా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్లో చేరిన వాళ్లు పవిత్రులా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా IT, ED దాడులు ఎందుకు జరుగుతున్నాయని లేఖలో ప్రశ్నించారు రేవంత్ . వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివని, కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఆయా దర్యాప్తు సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అని లేఖ ద్వారా కోరారు. దాడులకి అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్లాన్లు రచించడం... పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం... ఇదే జరుగుతున్నదన్నారు.
“కేసీఆర్కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ను ప్రశ్నించవు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై… దాడులు జరుగుతాయి. తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు… కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా? పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై కూడా ఉంది” అని రేవంత్ రెడ్డి లేఖలో కోరారు.