సీఎం అభ్యర్థి ఎవరో చెప్పేసిన రేవంత్ రెడ్డి.. అమెరికాలో కీలక వ్యాఖ్యలు
కర్నాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ మంచి ఊపుమీదుంది. అదే ఊపులో తెలంగాణలోనూ అధికారం చేపట్టాలని కసరత్తు చేస్తోంది. అయితే కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. తమ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని.. కాంగ్రెస్కు దమ్ముంటే తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలు సైతం సవాళ్లు విసురుతున్నారు.
ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తానా వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సీఎం అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్‌ను ఎన్నారైలు కోరారు. అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామన్నారు.
దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు కావొచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీలో పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదని.. పని చేసే వారికి గౌరవం కచ్చితంగా దక్కుతుందన్నారు. అదేవిధంగా ఏపీలో పోలవం ప్రాజెక్టు, రాజధాని అమరావతి కట్టేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే ఈ విషయం చెప్పారని.. తాను అదే ప్రస్తావిస్తున్నానని స్పష్టత ఇచ్చారు.