జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య

Update: 2023-06-26 05:14 GMT

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలో దారుణం జరిగింది. వివాహితతో మాట్లాడుతున్నాడని అనుమానించి ఓ యువకుడిని ఆమె కుటుంబసభ్యులు దారుణంగా చంపేశారు. వంశీ అనే యువకుడు తుంగూరు గ్రామంలో మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పని చేస్తున్నాడు. అతడు గతంలో మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం వేరే వ్యక్తితో పెళ్లి చేశారు.

పెళ్లి అయ్యాక కూడా ఆ యువతితో వంశీ ఫోన్లో మాట్లాడుతున్నాడని కుటుంబసభ్యులు అనుమానించారు. ఇలాగే కొనసాగితే యువతి కాపురం చెడిపోయే ప్రమాదం ఉందని భావించి యువకుడిని చంపినట్లు తెలుస్తోంది. వంశీ ఆదివారం బైక్పై వెళ్తుండగా.. తుంగూర్ వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న గొడ్డలి, ఇతర ఆయుధాలతో తలపై దాడి చేయడంతో వంశీ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం యువకుడి మొబైల్ తీసుకుని పరారయ్యారు.

కాగా నిందితులను తమకు అప్పగించాలని యువకుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. యువతి తండ్రి రమేష్‌, సోదరుడు విష్ణు కలిసి హత్య చేశారంటూ వంశీ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి తల్లి కూలి పనులు చేసుకుంటుండగా తండ్రి శ్రీహరి ఉపాధి నిమిత్తం ముంబయిలో ఉన్నారు. మృతుడికి ఓ సోదరుడు ఉన్నాడు. 


Tags:    

Similar News