TS DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఒక పోస్ట్కు పోటీ గట్టిగానే ఉంది!
తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీకి విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,089 పోస్టుల ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 21గా నిర్ణయించారు. పూర్తి సమాచారం కూడా సెప్టెంబర్ 20 నుంచి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటుంది. కాగా నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారి వయసు ఆగస్ట్ 1వ తేదీ నాటికి 18 నుంచి 40 ఏళ్ల వయసువారై ఉండాలి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పరీక్షలన్నీ అభ్యర్థుల పాత ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు.