Mahalakshmi scheme: ఈ నెలాఖరులోగా మరో హామీ.. మహిళలకు ప్రతినెలా రూ.2,500!
రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని అమలుచేయబోతుంది. ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించాలన్న హామీ మేరకు అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా ఆ హామీకి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. తాము అధికారంలోకి వస్తే.. 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆరు గ్యారెంటీల దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఇందులో మొదటి గ్యారంటీ.. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 6 వ గ్యారంటీ అయిన చేయూతలో రూ.10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కిందనే ప్రతినెలా మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం.
ఇప్పటికే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమవుతుందో రిపోర్ట్ ల ద్వారా వెల్లడించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారట. కర్ణాటకలో దాదాపు మూడున్నర కోట్ల మంది మహిళలుండగా, అక్కడ అర్హులైన కోటీ 25 లక్షల మందికి చెల్లిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇచ్చే ప్రాతిపాదికన ఇక్కడ కూడా చెల్లిస్తే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 30 లక్షల మంది మహిళలకు చెల్లించాలంటే ప్రతినెలా రూ.750 కోట్లు అవసరం. 40 లక్షల మందికి చెల్లించాలంటే రూ.వెయ్యి కోట్లు.. 60 లక్షల మందికి అయితే ప్రతినెలా రూ.1,500 కోట్లు అవసరం. అర్హతలతోపాటు ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నెలాఖరులోగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.