రాష్ట్రంలో మరో కొత్త మండలం.. నోటిఫికేషన్ ఇచ్చిన సర్కారు

By :  Kiran
Update: 2023-09-23 16:05 GMT

తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకానుంది. ములుగు జిల్లాలో మల్లంపల్లి మండలం ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. 3 గ్రామాలతో మల్లంపల్లి మండలం ఏర్పాటుకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంతరాలు, వినతులకు 15 రోజులు గడువు ఇచ్చింది. 2019 ఫిబ్రవరి 16న ములుగు జిల్లా ఏర్పాటైంది. జయశంకర్‌ భూపాలపల్లిలో ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్‌ను విడదీసి 9 మండలాలతో ప్రభుత్వం జిల్లా ఏర్పాటు చేసింది. తాజాగా మల్లంపల్లిని సైతం మండలంగా ఏర్పాటు చేయనుండడంతో ఆ జిల్లాలో మండలాల సంఖ్య 10కి చేరనుంది.

మల్లంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నో ఏండ్లుగా మల్లంపల్లి ప్రజలు కంటున్న కలను ముఖ్యమంత్రి సాకారం చేశారని అన్నారు. మల్లంపల్లి ప్రజల కోరికను మంత్రి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపాదనలు సైతం అందజేశారు. మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎంను ఒప్పించారు.

Tags:    

Similar News