అన్నదాతలకు గుడ్ న్యూస్.. 26 నుంచి రైతు బంధు నిధులు జమ..

Update: 2023-06-19 14:00 GMT

తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు నిధుల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు పోడు రైతులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు సైతం రైతు బంధు సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావుతో పాటు అధికారులను ఆదేశించింది. సీఎం ప్రకటనపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెరగనున్న లబ్దిదారులు

గతంలో రైతు బంధు పొందిన అన్నదాతలతో పాటు కొత్తగా పాస్ బుక్ వచ్చిన వారికి రైతుబంధు అందించనున్నారు. తొలుత తక్కువ భూమి ఉన్న రైతుల అకౌంట్లలో రైతు బంధు సొమ్ము జమచేస్తారు. అనంతరం ఎక్కువ భూమి ఉన్న వారి ఖాతాలకు రైతు బంధు సాయాన్ని ట్రాన్స్ఫర్ చేయనున్నారు. గతేడాది వానకాలం సీజన్‌లో మొత్తం 68.94 లక్షలు మందికి రైతు బంధు అందింది. 1.53 కోట్ల ఎకరాల భూమికి రూ.7,654.43 కోట్ల సాయం అందజేశారు. అయితే ఈసారి ఆ సంఖ్య పెరగనుంది. రైతుబంధు రాని రైతులు తమ గ్రామ ఏఈఓలకు పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కాపీలు అందజేయాలని అధికారులు సూచించారు.

2018 నుంచి అమలు

2018 వానకాలం సీజన్‌ నుంచి కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా రెండు సీజన్లకు ఆర్థికసాయం అందిస్తోంది. ఇలా 9 సీజన్లలో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించారు. ఈ పథకం కింద రాష్ట్ర రైతులకు ఇప్పటి వరకు రూ. 58,102 కోట్ల సాయం చేశారు.

Tags:    

Similar News