Anganwadi Teacher: అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఇకపై వారిని కూడా..
అంగన్‌వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ (వేతన సవరణ కమిషన్)లో వారిని కూడా చేరుస్తామని ప్రకటించింది. ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీల ప్రతినిధులు ఆదివారం మంత్రిని, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లను కలిసి తమ డిమాండ్లు విన్నవించి చర్చలు జరిపారు. వారి డిమాండ్లకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీ టీచర్లను చేర్చుతామని, దీని వల్ల 70 వేలమందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జీతాలను కూడా పెంచుతామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మంత్రి హామీలతో యూనియన్ల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ‘‘గత ప్రభుత్వాలు అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను నిర్లక్ష్యం చేశాయి. వారి పేరును అంగన్‌వాడీ టీచర్లుగా గౌరవప్రదంగా ఉండే విధంగా కేసీఆర్ మార్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్‌వాడీ టీచర్ల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో మా డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తున్నారు’’ అని ప్రశంసించారు. ఈ చర్చల్లో సీఐటీయూ ఏఐటీయూసీ యూనియన్ నాయకులు అంగన్‌వాడీ టీచర్ల హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.