Digital Health Cards: త్వరలోనే రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు.. సీఎం రేవంత్ రెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2024-01-18 03:08 GMT

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై ప్రసంగించిన సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ప్రకటించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని అని, అయితే నాణ్యమైన వైద్యసేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు.

ప్రజలందరికీ ఉత్తమ వైద్యసేవలు అందించాలనేదే తమ లక్ష్యమని రేవంత్‌రెడ్డి వివరించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిచనున్నట్లు చెప్పారు. డిజిటల్‌ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News