Prajapalana:దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తాం..మంత్రి పొంగులేటి
ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేకంగా 'ప్రజాపాలన' పేరుతో గత నెల డిసెంబర్ 28 న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఈనెల 6 వరకు సాగనుంది. ఈ కార్యక్రమంలో స్వయంగా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి దగ్గర అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా రెండ్రోజులు విరామం ఏర్పడింది. ఈ క్రమంలోనే తిరిగి జనవరి 2న ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు రెండు విడతలుగా గ్రామ, వార్డు సదస్సులు నిర్వహించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉండటంతో కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. గడువు తేదీ దగ్గరపడుతుండడంతో ప్రజలు.. ప్రజాపాలనకు పోటెత్తుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్లికేషన్లకు సమయం సరిపోక పోతే గడువు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వంపై కోటిఆశలతో దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ప్రజలు అన్ని పథకాలకు దూరమయ్యారని అన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే వస్తున్నాయని, అన్ని అప్లికేషన్లను గమనించి ఒక వ్యూహాత్మకంగా నిబద్దతతో ఉన్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పథకాలు అందిస్తామని చెప్పారు. 5సంవత్సరాలలో ఇళ్లులేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని తెలిపారు.