Bandi Sanjay Kumar : బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం

Byline :  Kiran
Update: 2023-09-05 09:40 GMT

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్కు ఆయన హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నేత, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ పలుమార్లు డుమ్మాకొట్టారు. తాజాగా మరోసారి ఆయన గడువు కోరడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

కేసు విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనం బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్కు అనుమతించింది. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున మరోసారి గడువు ఇవ్వాలని బండి తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఎన్నికల పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణ ముగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించిన ఆయన గత జులై 21 నుంచి 3సార్లు గడువు కోరారు.

ఈ నెల 12న బండి సంజయ్ కోర్టుకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. దీంతో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యేందుకు సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. 




Tags:    

Similar News