తెలంగాణలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు ఆపాలని.. టీఎస్ఎల్పీఆర్బీ (తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు) జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. నియామక పరీక్షలో ప్రశ్నలు తప్పుగా రావడంతో 4 మార్కులు కలపాలని హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్ట్ ఆదేశించినా.. ఎక్స్ ట్రా మార్కులు కలపకుండా.. నియామక ప్రక్రియ కొనసాగుతుందని పిటిషనర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెడికల్ టెస్టులు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని టీఎస్ఎల్పీఆర్బీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా మెడికల్ టెస్టులు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియాల్సి ఉంది.