TSPSCలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై పెండింగ్ లో పెట్టారు. ఇక ఇవాళ TSPSC సభ్యుడు ఆర్.సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా మిగిలిన సభ్యులు కూడా తమ రాజీనామ లేఖలను గవర్నర్ కు పంపించారు. బండి లింగారెడ్డి, కోట్ల అరుణాకుమారి, సుమిత్రా ఆనంద్, కారెం రవీంద్రా రెడ్డి తమ పదవులకు రిజైన్ చేశారు. కాగా గతేడాది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కావడం.. మళ్లీ ఆ పరీక్షను నిర్వహించగా అవకతవకలు జరిగాయంటూ హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. ఈ రెండు సందర్భాలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణలో కూడా కూడా అనిశ్చితి నెలకొంది. దీంతో జనార్ధన్ రెడ్డిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. కానీ ఆయనను మాత్రం ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. TSPSCకి సంబంధించిన అన్ని వివరాలతో తనను కలవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం జనార్ధన్ రెడ్డిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే TSPSCలో వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి.