BRS మాజీ ఎమ్మెల్యేకి షాక్.. విద్యుత్ సరఫరా నిలిపివేత
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కష్టాలు చుట్టుముట్టాయి. ఆర్మూరులో ఆయన లీజుకు తీసుకున్న షాపింగ్ మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రూ.7 కోట్లకుపైగా బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఆర్మూర్ స్థానిక బస్టాండ్‌కు ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7 వేల చదరపు గజాల స్థలాన్ని.. 2013లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఈ సంస్థ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డి పేరుపై ఉందని ఆర్టీసీ సూపరింటెండెంట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో కొంతకాలం క్రితం జీ-1(జీవన్‌రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్) పేరిట భవన నిర్మాణం చేపట్టి దుకాణాలు, సినిమా హాల్స్ ఏర్పాటు చేశారు. ఏడాది ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసు ఇస్తూ వచ్చారు. అయినా ఎంతకూ చెల్లించకపోవడంతో గురువారం హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్టీసీ సిబ్బంది మాల్ వద్దకు వెళ్లి.. మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాలు ప్రకటించారు. వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. దుకాణ సముదాయ యాజమానులకు జీవన్ మాల్ లో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని హెచ్చరించారు. లేకపోతే వారం రోజులలోపు జీవన్ మాల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.2.5 కోట్ల వరకు ఉండటంతో గురువారం సరఫరాను నిలిపివేశారు. ఈ వ్యవహారాన్ని విద్యుత్‌శాఖ ఏడీఈ శ్రీధర్ ధ్రువీకరించారు. ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నామని, వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్‌శాఖ అధికారులు చెప్పారు. ఆర్టీసీ ప్రాంగణంలో లీజుకు తీసుకొని ఎమ్మెల్యే సతీమణి నిర్మాణ పనులు చేపట్టిన నాటి నుంచి రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారింది. గతంలో ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు, అప్పటి పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఆర్మూర్ వచ్చినప్పుడు కచ్చితంగా జీవన్ రెడ్డి మాల్ ప్రస్తావన తెచ్చి విమర్శించే వారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి ఆ విమర్శలను బేఖాతరు చేసేవారు. ఇప్పడు రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ కావడంతో .. ఈ వ్యవహారం ఆర్మూరులో చర్చనీయాంశంగా మారింది.