ఆ రూట్లో మహిళల కోసం స్పెషల్ బస్.. టీఎస్ఆర్టీసీ నిర్ణయం

Update: 2023-07-29 03:44 GMT

ఆక్యుపెన్సీ పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక చర్యలు చేపడుతోంది. ఇందలో భాగంగా టికెట్లపై డిస్కౌంట్ ఇతర ఆఫర్లు ప్రకటించింది. తాజాగా టీఎస్ఆర్టీసీ మహిళల కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఐటీ కారిడార్ లోని మహిళా ప్యాసింజర్ల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో ప్రకటించారు.

హైదరాబాద్ ఐటీ కారిడార్లో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ చెప్పారు. ఈ లేడీస్ స్పెషల్ బస్సు 'జేఎన్టీయూ-వేవ్ రాక్' మార్గంలో ఉదయం, సాయంత్రం నడుస్తుంది. ఈ నెల 31 నుంచి ఈ స్పెషల్ బస్సు అందుబాటులోకి రానుంది. వేవ్‌రాక్, ఫోరమ్ మాల్, నెక్సస్‌ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌ రోడ్డు, ఇంద్రానగర్, ట్రిపుల్ ఐటీ క్రాస్‌ రోడ్డు, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్‌ రూట్‌లో ఈ బస్సు ప్రయాణిస్తుంది. మహిళా ప్యాసింజర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు. ఉదయం 9.05 నిమిషాలకు జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ కు, సాయంత్రం 17.50గంటలకు వేవ్ రాక్ నుంచి జేఎన్టీయూకు ఈ బస్సు నడపనున్నారు.

మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యం కోసం టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వేవ్‌రాక్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ఎదురుచూసే సమస్యలేకుండా ప్రత్యేక మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును అందుబాటులోకి తెచ్చారు. సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఐటీ కారిడార్‌లో జాబ్స్ చేస్తున్న మహిళా ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్స్, వెహికల్స్‌పై ఆధారపడాల్సి వస్తోందని, ఇప్పుడా కష్టం తప్పుతుందని అంటున్నారు.

Tags:    

Similar News