ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడానని నిరసిస్తూ ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ అన్ని డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అడ్డుపడితే సహించే ప్రసక్తేలేదని అంటున్నారు. ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి.
ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కుటుంబాలలో కేసీఆర్ వెలుగులు నింపితే.. గవర్నర్ మాత్రం అంధకారం నింపేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ఓ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారన్న ఆయన బిల్లును ఆమోదించకపోతే నిరసనలు ఉద్ధృతం చేస్తామని చెప్పారు.