MD VC Sajjanar:'ఇదేం అభిమానం'.. బిగ్‌బాస్ ఫ్యాన్స్‌పై సజ్జనార్ ఫైర్

Update: 2023-12-18 07:49 GMT

బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేతను ప్రకటించిన తర్వాత కృష్ణానగర్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్‌ ఫ్యాన్స్‌గా చెప్పబడుతున్న కొందరు.. మరో కంటెస్టంట్, రన్నరప్ అయిన అమర్‌దీప్ కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఈ ఉదయం వార్తలు వచ్చాయి. అమర్‌దీప్ కారుతోపాటు మరికొందరు సెలబ్రిటీల కార్లను ఆ అల్లరి మూక ధ్వంసం చేశాయి. అంతటితో ఆగకుండా ప్రజా రవాణా వాహనం అయిన టీఎస్ఆర్టీసికి చెందిన 6 సిటీ బస్సుల‌పై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదుచేశారు.

ఈ ఘ‌ట‌న‌పై టీఎస్ఆర్టీసి ఎండి సజ్జనార్ (MD VC Sajjanar) ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని మండిపడ్డారు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేశారు. 

"ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.




Tags:    

Similar News