Tummala Nageswara Rao : పోటీ చేస్తా, గెలిచే వస్తా.. తుమ్మల తేల్చేశారు.. 2 వేల బైకులు, 1000 కార్లు..

Update: 2023-08-25 14:03 GMT

మాజీ మత్రి తుమ్మల నాగేశ్వరావు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమైంది. ఖమ్మం జిల్లా ప్రజల కోసం తను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ‘’40 ఏళ్లుగా ప్రజలతో ఉన్నాను. వారు నాకు ఎన్నో అవకాశాలు కల్పించారు. వారి రుణం ఏమిచ్చినా తీరదు. గోదావరి నీటితో వారి కాళ్లు కడగడానికి ఎమ్మెల్యేగా గెలిచి వస్తా’’ అని ఉద్వేగంతో అన్నారు. పాలేరు నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన శుక్రవారం భారీ బలప్రదర్శనకు దిగారు. వెయ్యి కార్లు, 2 వేల బైకులతో హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్దకు పెద్ద సంఖ్యలో అనుచరులతో ర్యాలీగా వెళ్లారు. తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎన్నికలలతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎం కేసీఆర్‌కు చెప్పానని, అయితే జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తుమ్మల చెప్పారు.

‘‘నేను ఎవరికీ తలవంచను. ఈ ఎన్నికలో నాకు పెద్దగా పనిలేదు. నా రాజకీయం ప్రజల సంక్షేమ కోసమే. ఎన్నోసార్లు కిందపడ్డాను, పైకి లేచాను. నాకు టికెట్ రాలేదని కొందరు శునకానందం పొందుతూ ఉండొచ్చు. నేనెవరినీ ఏమీ అనను. నా భవితవ్యం ప్రజల చేతుల్లో ఉంది. వారి ఆశీర్వాదంతో పోటీ చేస్తా, శభాష్‌ అనిపించుకుంటా’’ అని అన్నారు. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో తుమ్మతను తమవైపు ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ టికెట్లకు దరఖాస్తు చేసుకునే గడువు ఆ రోజు ముగియడంతో ఆయన పార్టీ మారినా టికెట్ దక్కదంటున్నారు. పార్టీ మార్పుపై తుమ్మల ఇంతవరకు స్పందించలేదు. తమ్ముల తమ పార్టీల చేరాలని బీజేపీ నేతలు కూడా రాయబరాలు పంపుతున్నారు. ఆయన బీజేపీలో చేరే ప్రసక్తే లేదని, కాంగ్రెస్‌లో చేరితే బావుంటుందని అనుచరులు కోరుతున్నారు.

Tags:    

Similar News