Shakeel : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసులో ట్విస్ట్.. పరారీలో సీఐ
పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు పంజాగుట్ట సీఐ దుర్గారావు సహకరించినట్లు విచారణలో తేలింది. ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న అతడి కాల్ డేటా ఆధారంగా బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ సహా మరో ఇద్దరితో మాట్లాడినట్లు విచారణలో గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం దుర్గారావు పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇప్పటికే బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్ కుమార్ ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. షకీల్ కొడుకు సాహిల్ను దుబాయ్ పంపించడంలో వీరి పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా డిసెంబర్ 23న అర్ధరాత్రి సమయంలో సోహెల్ అతివేగంగా కారు నడిపి ప్రజాభవన్ ముందు ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను కారుతో ఢీ కొట్టాడు. అయితే కారు నడిపింది తానే అంటూ డ్రైవర్ ఆసీఫ్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే సీసీటీవీ పుటేజీలో సాహిల్ కారు నడిపినట్లు ఉండడంతో పోలీసులు సాహిల్ సహా షకీల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.