Sarpanch Navya : 'స్టేషన్ ఘన్‌పూర్'లో కీలక పరిణామం.. టికెట్ తనకే ఇవ్వాలంటున్న నవ్య
తెలంగాణ రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్నవారికి బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Thatikonda Rajaiah ) పై గతంలో వరుస ఆరోపణలు చేసి.. ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. అయితే ఆ ఆరోపణల నేపథ్యంలోనో లేదంటే మరేతర కారణాల వల్లనో కానీ.. జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేకు మాత్రం టికెట్టు దక్కలేదు. ఇటీవల కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటించారు. ఆ జాబితాలో.. దాదాపు 95 శాతం వరకు.. సిట్టింగులకే అవకాశం ఇచ్చారు. ఇక తొలి విడత అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసిన నాటి నుంచి అసంతృప్తులు తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు.
ఇటువంటి పరిణామాల మధ్య తాజాగా సర్పంచ్ నవ్య..స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించాలని అంటున్నారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య వర్గం.. అటు కడియం శ్రీహరి వర్గం నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ గొడవలు లేకుండా ప్రజలకు అన్యాయం జరగకుండా.. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ అన్న అవకాశం ఇస్తే.. మీ ఆశీస్సులతో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నట్లు సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు.
పోటీ కోసం ఒక్కఛాన్స్ ఇవ్వండని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేడుకుంటున్నారు. ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుండి ఒక్కసారి కూడా మహిళా ఎమ్మెల్యే ఎన్నిక అవ్వలేదని, తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 1న) హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులను నవ్య దంపతులు కలవనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రత్యేక అర్హతలు ఏమీ అవసరం లేదంటున్నారు సర్పంచ్ నవ్య. ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన నవ్య ఇప్పుడు టిక్కెట్టు కోసం పోటీ పడడంపై ప్రజలలో చర్చ జరుగుతోంది.