కుమార్తెలతో కలిసి తండ్రి, కొడుకులతో కలసి తల్లి సూసైడ్
శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో తండ్రీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్త అందర్నీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. స్థానిక భవానీనగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ చారి (42) అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల(స్రవంతి (8), శ్రావ్య (7))తో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. సైనైడ్ తీసుకొని వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబంలో కలహాలు లేదంటే ఆర్థిక వ్యవహారాలే వీరి ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అంటున్నారు.
ఇదిలా ఉండగా నగరంలోని మరోచోట మరో కుటుంబం.. ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నగరంలోని బోరబండలో.. ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం మేరకు.. జ్యోతి(31) అనే మహిళ బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నది. ఆమె భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, జ్యోతి తన ఇద్దరు పిల్లలు అర్జున్(4), ఆదిత్య (2)లకు విషమిచ్చి తాను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.