హైదరాబాద్ మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించి రెండు రైళ్లను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం దాదాపు అరగంట పాటు రెండు రైళ్లను ట్రాక్స్ పైనే నిలిపేశారు. రూట్ క్లియర్ చేసిన తర్వాత ఓ రైలును మరో ట్రాక్ పైకి మళ్లించారు. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే సమయం కావడంతో ప్రమాదం జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణకు ఆదేశించారు. రెండు రైళ్లు ఒకే లైన్‌లోకి ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. లోపం ఎక్కడ జరిగిందని తెలుసుకుని కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.