అంబులెన్స్‌ కోసం సిగ్నల్‌ క్లియర్‌..కట్ చేస్తే బజ్జీలు కొన్నాడు..వీడియో వైరల్

Update: 2023-07-11 15:05 GMT

సైరన్‌ వేస్తున్న అంబులెన్స్ వస్తే ఎవరైనా దారి ఇవ్వాల్సిందే. ప్రాణాపాయా స్థితిలో పేషంట్లను తరలించే అంబులెన్స్‌‌లను త్వరగా పంపేందుకు అందరూ సహకరిస్తారు. డ్యూటీలో ఉన్న పోలీసులు సైతం వాటిని త్వరగా గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో సిగ్నల్ క్లియర్ చేస్తుంటారు. అయితే కొందరు అంబులెన్స్‌ డ్రైవర్లు బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ.. సైరన్‌ ఉపయోగించి వాహనదారులకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారు. హైదరాబాద్‎ నారాయణగూడలో కూడా ఇదే జరిగింది.

సైరన్ మోగిస్తూ వచ్చే అంబులెన్స్ అంతా రూట్ క్లియర్ చేసి సిగ్నల్ దాటించారు. అయితే తర్వాత ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌ వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. సిగ్నల్‌ దాటిన తర్వాత కాస్త ముందుకెళ్లిన అతడు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి.. బజ్జీలు, కూల్ డ్రింక్‌లు కొనుక్కున్నాడు.

ఈ విషయాన్ని గమనించిన ఓ పోలీస్ వెంటనే వాహనం దగ్గరకు వెళ్ళాడు. అంబులెన్స్‌ను పరిశీలించి అందులో రోగి ఎవరూ లేరని తేల్చారు. పేషెంట్ ఎవరూ లేకుండా సైరన్‌ ఎందుకు మోగించావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలను ఆ కానిస్టేబుల్ వీడియో తీయగా వాటిని డీజీపీ అంజనీ కుమార్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే సైరన్‌ను దుర్వినియోగం చేయొద్దంటూ అంబులెన్స్‌ డ్రైవర్లకు హెచ్చరించారు. అలా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Tags:    

Similar News