అమరుల ప్రాణ త్యాగం - దొరకు దక్కిన అధికార వైభోగం - వైఎస్ షర్మిల

Update: 2023-06-22 12:55 GMT

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరజ్యోతి ప్రారంభం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అమరుల ప్రాణ త్యాగంతో వచ్చిన తెలంగాణలో దొర అధికార వైభోగం వెలగబెడుతున్నారని విమర్శించారు. అమరుల ఆశయాలన్నీ గోదారి పాలయ్యాయని, రాష్ట్ర సంపదంతా కేసీఆర్ పాలైందని మండిపడ్డారు. 9ఏండ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ ఎందుకు పుట్టుకొచ్చిందని షర్మిల ప్రశ్నించారు.

అమరుల ప్రాణ త్యాగం - దొరకు దక్కిన అధికార వైభోగం.రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో అయితే..ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్. అసువులు బాసిన అమరుల ఆశయాలు గోదారి పాలైతే .. స్వరాష్ట్ర సంపద అంతా కేసీఆర్ పాలయ్యే. నిధులు మింగే, నీళ్ళు ఎత్తుకు పోయే, ఉద్యోగాలు ఇంట్లనే ఇచ్చుకునే. త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర.. అమరుల కుటుంబాలను ఆద మరిచిండు. ఇన్నాళ్లు వాళ్ళెవరో అన్నట్లు, గుర్తుకు లేనట్లు నాటకాలు ఆడిండు. ఉన్నట్లుండి 9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ మళ్లీ పుట్టుకొచ్చే. అమరుల ప్రాణ త్యాగం వెలకట్టలేనిది అంటూ కుండపోతగా ప్రేమను కురిపించే పన్నాగం పన్నుతున్నడు అని షర్మిల మండిపడ్డారు

ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే అమరవీరులు మళ్ళీ యాదికొచ్చారు. రాష్ట్ర సాధనకై 1500 మంది ప్రాణాలు కోల్పోతే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు ఇది. 1200 మంది అమరవీరులయ్యారని సొంత లెక్కలు బయటపెట్టిన కేసీఆర్.. ఆదుకున్నది 528 మందిని మాత్రమే. మిగిలిన 700 మంది అమరుల త్యాగాలను,చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేసిండు. ఇల్లు, ఉద్యోగం, భూమి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు కేసీఆర్. అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తనని చెప్పి కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే తప్పా వారి పేర్లు ఎక్కడా చెక్కలే. ఇన్నాళ్లు గుర్తుకు రాని శంకరమ్మకు పిలిచి MLC ఇస్తాడట. కొత్తగా అమరులకు న్యాయం చేస్తాడట. ఉద్యమాన్ని అణగదొక్కిన ఉద్యమద్రోహులను అక్కున చేర్చుకొని తెలంగాణ తల్లికి ఆత్మఘోష రగిల్చిన మారీచుడు ఈ కేసీఆర్. ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు..అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేండ్లు పట్టింది! కేసీఆర్ వంటి ఉద్యమద్రోహులు అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరించడం అంటే అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టేనని షర్మిల సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News