తెలంగాణకు అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

By :  Kiran
Update: 2023-07-10 02:08 GMT

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఓ మోస్తారు వానలు కురుస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 5 రోజులు రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆదివారం రాత్రి వెదర్ బులిటెన్‎ను విడుదల చేసింది. అంతే కాదు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్‎లోనూ ఆదివారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి.ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లోనూ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయని తెలిపింది.

ఈ నెల 13,14వ తేదీల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. 15తో తారీఖున కూడా రాష్ట్రంలో అత్యల్ప వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్‌లో ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉంది. రాత్రి వేళల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతే కాదు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం నల్గొండలో అత్యధికంగా 34 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మెదక్‌లో 21.5 డిగ్రీల స్వల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 




Tags:    

Similar News