Uttam Kumar Reddy : బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ కూడా వెళ్లాలి

Byline :  Bharath
Update: 2024-02-28 14:55 GMT

తెలంగాణ రాజకీయం కాళేశ్వరం చుట్టూ తిరుగుతోంది. అధికార-ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరంపై కత్తులు నూరుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలతో ప్రభుత్వం మేడిగడ్డను సందర్శించగా.. ఇప్పుడు బీఆర్ఎస్ రెడీ అయ్యింది. ప్రభుత్వానికి పోటీగా కాళేశ్వరం సందర్శనకు వెళ్లనుంది. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటనను స్వాగతిస్తున్నామని అన్నారు. వారి పర్యటనకు పూర్తిగా సహకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇంత భారీ అవినీతికి పాల్పడి కూడా మేడిగడ్డకు వెళ్తామని ఎలా అంటారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ జలసౌధలో మాట్లాడిన ఆయన ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు పోవాలి.. తర్వాత రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు చీఫ్ ఇంజనీర్ అయిన కేసీఆర్ ను కూడా వారి వెంట తీసుకెళ్లాలని అన్నారు. కేసీఆర్ కూడా క్షమాపణ చెప్తే బాగుంటుందని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదని విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్ట్ కట్టొద్దని నిపుణులు సూచించినా.. వినలేదని మండిపడ్డారు. కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారాన్ని మోపారని ఆరోపించారు. 

Tags:    

Similar News