ఆగ్రా హైవేపై యాక్సిడెంట్.. కోళ్ల వ్యాన్ ఖాళీ చేసిన జనం..

By :  Kiran
Update: 2023-12-27 10:26 GMT

ఉత్తర్ప్రదేశ్లో మానవత్వం మంటగలిసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడాల్సిన జనం సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. రక్తమోడుతున్నా పట్టించుకోకుండా సదరు వ్యక్తి నడుపుతున్న వ్యాన్ లోని కోళ్లను ఎత్తుకెళ్లారు. ఆగ్రా నేషనల్ హైవేపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

యూపీలోని ఆగ్రా నేషనల్ హైవేపై ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ మంచు కారణంగా ఎదురుగా వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు వెహికిల్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఇలా 12 నుంచి 15 వాహనాలు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో బ్రాయిలర్ కోళ్ల లోడుతో వెళ్తున్న ఓ వ్యాను డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తులు సదరు డ్రైవర్ను హాస్పిటల్కు తరలించాల్సిందిపోయి దారుణంగా వ్యవహరించారు.

వ్యానులో ఉన్న బ్రాయిలర్ కోళ్లను అందినకాడికి ఎత్తుకుపోయారు. స్థానికులకు విషయం తెలియడంతో వారంతా పరుగున అక్కడకు చేరుకున్నారు. కోళ్లను బస్తాల్లో నింపుకొని పోయారు. డ్రైవర్ ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా అందినకాడికి దోచుకుపోయారు. ఇలా చూస్తుండగానే వ్యానులో ఉన్న కోళ్లన్నీ మాయం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో 500 కోళ్లు ఉన్నాయని, వాటి విలువ లక్షన్నర ఉంటుందని వ్యాన్ డ్రైవర్ వాపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడకుండా కోళ్లు ఎత్తుకుపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.




Tags:    

Similar News