Vemula Veeresham Resign: బీఆర్ఎస్కు వేముల వీరేశం గుడ్ బై

Update: 2023-08-23 12:20 GMT

బీఆర్ఎస్లో టికెట్ల మంటలు ఇంకా చల్లారడం లేదు. గులాబీ బాస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. టికెట్లు రాని నేతలంతా పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ వంటి నేతలు పక్క పార్టీలవైపు చూస్తుండగా.. మరికొందరు కేసీఆర్ వెంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వీరేశం ప్రకటించారు. నకిరేకల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఇవాళ్టి నుంచి బీఆర్ఎస్ తో ఉన్న అనుబంధం తెగిపోయిందని వీరేశం అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాలపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

‘‘నేను ఏంచేశానని నాలుగున్నరేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉద్యమకాలంలో దెబ్బలు తిని జైలుకు వెళ్లాను. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులతో కొట్టించినా జిల్లా‌ నాయకత్వం పట్టించుకోవడం లేదు. నా గన్‌మెన్‌లను కూడా తొలగించారు. ఇన్ని‌ బాధలు పెట్టినా భరించా.. ఇకపై భరించలేను. అందుకే పార్టీ వీడుతున్నా అని వీరేశం ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా 2014లో నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిపొందారు. గత ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓడిపోయారు. ఈ సారి బీఆర్ఎస్ టికెట్ లింగయ్యకే ఇవ్వడంతో వీరేశం అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.



Tags:    

Similar News