ఈటలకు బీజేపీ షాక్.. సీఎంతో తలపడుతున్నా విలువివ్వడం లేదు!
అంతర్గత కలహాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. ఈ జాడ్యం ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి కూడా సోకింది. ఆధిపత్యం కోసం కమల నేతలు ఒకర్నొకరు దెబ్బతీసుకుంటున్నారు. ప్రత్యర్థులతో కాకుండా సహచర నేతలతో గొడవలకు దిగి అసలుకే ఎసర్లు పెడుతున్నారు. పార్టీలో పైస్థాయిలో ఉన్న ఈటల రాజేందర్‌కు కూడా ఇంటిపోరు తప్పలేదు. ఈటల అండతో వేములవాడ టికెట్ సంపాదించిన తుల ఉమకు బీజేపీ చివరి క్షణంలో బీఫామ్ ఇవ్వడానికి నిరాకరించి ఆయనకు పెద్ద షాకిచ్చింది. ఉమ స్థానంలలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొడుకైన వికాస్ రావును బరిలోకి దింపింది. ఉమకు టికెట్ కేటాయించి ఆఖరి క్షణంలోఆశలపై నీళ్లు చల్లడంతో పార్టీలో కలకలం రేగుతోంది. ఈ మార్పు అటు ఈటలకే కాకుండా బీసీ సామాజిక వర్గానికి కూడా మింగుడుపడ్డం లేదు.
బీఆర్ఎస్‌ను వదిలిపెట్టి కాషాయ కండువా కప్పుకున్న ఉమ తను వేములవాడ నుంచి బరిలోకి దిగుతున్నట్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే ఆ స్థానం నుంచి బండి సంజయ్ బరిలోకి దిగుతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తన సామాజిక వర్గానికే చెందిన ఉమకు ఈటల గట్టిగా మద్దతిచ్చారు. వేములవాడ టికెట్ కోసం వికాస్ రావు ఎంత ప్రయత్నించినా అధిష్టానం ఈటల మాటకే ‘తలొగ్గి’ ఉమకు టికెట్ ఇచ్చింది. తర్వాత ‘మారిన పరిస్థితులను’, వికాస్ రావు నిరసనను దృష్టిలో ఉంచుకుని మాట మార్చి ఆయననే బరిలోకి దింపింది. ఈ నిర్ణయంపై ఈటల పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీ బీసీలను, మహిళలను మోసం చేస్తోందని సంకేతం వెళ్లిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీకి పెద్ద అండగా నిలబడి, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌నే ఢీకొంటున్న ఈటల మాటల పూచిక పుల్లలా తీసేయండంతో పార్టీలో ఓ వర్గం ఆయనకు ఇంకా వ్యతిరేకంగానే పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది. వేములవాడతోపాటు హుస్నాబాద్ సహా పలుః స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈటలకూ రాష్ట్ర పార్టీ నేతలకూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈటల వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనిపిస్తూ లోలోపల చేయాల్సింది చేసేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. అధిష్టానం కిషన్ రెడ్డి మాటలనే వింటూ గెలుపు అవకాశాలను దెబ్బతీసుకుంటోందని, ఈటల లాంటి నాయకులను ఇబ్బంది పెడితే పార్టీకే నష్టమని హెచ్చరిస్తున్నారు.
Vemulawada bjp candidate change sparks row in party as Etala Rajender losing importance