Babu Mohan: బీజేపీ చీఫ్‌పై విమర్శలు చేస్తూ పార్టీకి రాజీనామా
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి పి బాబూమోహన్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల కారణంగా పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం, మిగతా నాయకులతో ఇమడకపోవడం వల్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు బాబు మోహన్. ఈ పరిస్థితుల వల్లే పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి తనను దూరం పెడుతూ తన ఫోన్ సైతం తీయడం లేదంటున్నారు. ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన పార్టీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆందోల్ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘోర పరాజయాన్ని చవిచూశారు బాబు మోహన్. బీజేపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా లో ఇక ఈ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యను అని ప్రకటించారు. దీంతో బీజేపీ ఆయనకు అందోల్ నియోజకవర్గ అభ్యర్థిగా మూడో లిస్టులో ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచింది. అయితే అప్పటివరకూ అందోల్ టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసిన బాబు మోహన్ తనయుడు ఉదయ్ బాబు మోహన్ కు బీజేపీ మొండిచెయ్యి చూపించింది. దీంతో తండ్రితో ఉన్న విభేదాలకు తోడు బీజేపీ టికెట్ కేటాయించకపోవటంతో ఉదయ్ బాబు తీవ్ర అసంతృప్తికి లోనై బీఆర్ఎస్ లో చేరాడు. ఇక బాబు మోహన్, బీజేపీ పార్టీ తరపున 2018 ఎన్నికల్లో అందోల్ నుండి పోటీచేసి డిపాజిట్ కోల్పోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2404 ఓట్లు, 2023 అసెంబ్లీ 5,524 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వరంగల్ ఎంపీ టికెట్ ను బాబు మోహన్ అడుగుతున్నారని సమాచారం. వరంగల్ టికెట్ బాబు మోహన్ కు ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం సానుకూలంగా లేదనే సమాచారం.