V Hanumantha Rao : నా వయసు మించిపోలేదు..ఖమ్మం లోక్ సభ టికెట్ ఇవ్వండి వీహెచ్ కామెంట్స్
కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. నా పేరును లిస్టులో లేకుండా చేశారు. ఎందుకింత కక్షగట్టారు. కాంగ్రెస్ వల్లే కింది స్థాయి నుంచి వచ్చా అన్నారు. తాను ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించిన మరికొంతమంది పేర్లను ఢిల్లీ అధిష్టానానికి పంపారు. ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై వీహెచ్ అవేదన వ్యక్తం చేశారు.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు పోటీ నుంచి తప్పుకున్న వీహెచ్ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పలుమార్లు మీడియాతో తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన త్యాగాలకు గుర్తుగా ఖమ్మం లోక్ సభ నుంచి తనను బరిలో దింపి గెలిపించాలని ఆయన కోరుతున్నారు. కానీ ఆయన వయసు మీద పడటం కారణంగా చూపి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. వీహెచ్ మాట్లాడుతూ.. నాకు వయసు ఇంకా మించిపోలేదు. ఇప్పటికి నేను చాలా చురుగ్గా పని చేస్తున్నా.. నాలా పార్టీలో పనిచేసే నేత ఎవరూ లేరు. ప్రజలకు సేవ చేయాలన్నదే నా తపన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం పంపిన పేర్లలో వీహెచ్ పేరు లేకపోవడంతోనే ఈ వ్యాఖ్యలు చేశారా.. లేక తనకు టికెట్ ఇవ్వడంలేదనే అసహనంతో ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.