Mlc kavitha : కాంగ్రెస్ సభలో 40 నిమిషాలు కరెంటు కట్..వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో అన్నదాత కష్టాలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కరెంట్ కోతలతో రైతులు అనేక భాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 303 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పాల్గొన్నారు. సభ జరుగుతుండగా కరెంట్ పోవడంతో అక్కడికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీలో పవర్ కట్.. అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత.. అంటూ కవిత ట్వీట్ చేశారు. జీవన్ రెడ్డి ఓ పేపర్‌తో గాలి విసురుకుంటున్న వీడియోను షేర్ చేశారు. కాసేపు కరెంట్ పోతేనే ఇంతగా అల్లాడిపోతున్నారు.
ఈ సభకు సంబంధించిన ఓ వీడియోను కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీనియర్ అయిన జీవన్ రెడ్డి కాసేపు కరెంట్ లేకపోతేనే మీరు అల్లాడిపోతున్నారు.. మీరు స్వయంగా ఫోన్ చేసినా కూడా కరెంటు రాని పరిస్థితి! మరి కరెంట్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కరెంట్ లేకపోతే వారికి ఎంత దుఃఖం ఉంటుందో అర్థం చేసుకోండి. ప్రజల కరెంటు కష్టాలు పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోంది ప్రచారం పై పెట్టే శ్రద్ధ పాలనపై పెట్టమని సీనియర్ గా మీరైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి అని ట్వీట్ చేశారు. దాదాపు 40 నిమిషాలపాటు కరెంటు రాకపోవడంతో అక్కడివారు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. అధికారిక సమావేశంలో జనరేటర్, చార్జింగ్ మైక్, తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.