Medigadda Barrage : కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు.. కీలక ఫైళ్లు స్వాధీనం..
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కాంగ్రెస్ సర్కారు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల సేకరిస్తున్నారు. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఉన్న కాళేశ్వరం కార్పొరేషన్ ఆఫీసులో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌లోని సాగునీటి డివిజన్ కార్యాలయాల్లో మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్ ఎల్‌ఎండీలోని ఇరిగేషన్ ఆఫీసులోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
10 ఇంజనీరింగ్, విజిలెన్స్ బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయి. పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సోదాల సమయంలో ఈఎన్సీ మురళీధర్ జలసౌధ నుంచి వెళ్లిపోయారు. విజిలెన్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చినట్లు చెప్పారు. మీడియా ప్రశ్నించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.