మేడిగడ్డ కుంగుబాటు.. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు..!
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పటికే మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. మానవ తప్పిదం వల్లే బ్యారేజీ డ్యామేజ్ అయినట్లు విజిలెన్స్ గుర్తించింది. దీనికి సంబంధించి నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. తర్వలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.
2019లోనే మేడిగడ్డ డ్యామేజీ అయినట్లు విజిలెన్స్ అనుమానిస్తోంది. బ్యారేజీ ప్రారంభమయ్యాక మొదటి వరదకే పిల్లర్లకు పగళ్లు వచ్చినట్లు గుర్తించింది. కాంక్రీట్, స్టీల్ నాణ్యతా లోపమే దీనికి కారణమని భావిస్తోంది. పగుళ్లను రిపేర్ చేయాలంటూ వర్షాకాలానికి 10 రోజుల ముందే ఎల్ అండ్ టీకి అధికారులు లేఖ రాయగా.. ఆ సంస్థ నుంచి ఎటువంటి స్పందన లేనట్లుగా విచారణలో తేలింది. వర్షాకాలంలో మెయింటనెన్స్ రిపేర్స్ కష్టమంటూ ఎల్ అండ్ టీ నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత వచ్చిన వరదలకు 11 నుంచి 20 పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డట్లు విజిలెన్స్ గుర్తించింది. అధికారులు సకాలంలో గుర్తించకపోవడంతో బ్యారేజీ ప్రమాదంలో పడిందని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. మేడిగడ్డ డిజైన్, నిర్మాణానికి చాలా తేడా ఉన్నట్లు ఆరోపించింది. ప్రాజెక్టుకు సంబంధించి చాలా రికార్డులు మాయమైనట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ క్రమంలో 2018 నుంచి మేడిగడ్డ నిర్మాణంపై శాటిలైట్ డేటా ఇవ్వాలని విజిలెన్స్ అడిగింది. రెండు, మూడే రోజుల్లో శాటిలైట్ డేటా విజిలెన్స్ చేతుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మేడిగడ్డ నిర్మాణంపై విచారణ జరుపుతోన్న విజిలెన్స్.. త్వరలో పంప్ హౌజ్లపై ఫోకస్ పెట్టనుంది.