Telangana: బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా కృష్ణాలో కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా శంఖారావం పూరించారు. రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లగా విభజించి యాత్రలు కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా 40 సీట్లకే పరిమితం కాబోతోందని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కూడా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.
114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,500 కి.మీ మేర ఈ యాత్రలు జరుగనున్నాయి. యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీన ఈ యాత్రలు ముగియనున్నాయి. ముగింపు సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో విస్తృతంగా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. లోక్‌సభ న్నికల షెడ్యూల్ మరో రెండు నెలల్లో వెలువడనుంది. ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జాతీయ స్థాయి సమావేశాల్లో దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ నేతలు సంసిద్ధులు కావాలని అధిష్ఠానం పిలుపునిచ్చింది.