కాంగ్రెస్‌కు కొత్త ఊపునిచ్చిన విజయభేరి సభ

Byline :  Veerendra Prasad
Update: 2023-09-18 03:14 GMT

తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన విజయభేరి సభ ఊహించని రీతిలో సక్సెస్‌ అయ్యింది. ఈ సభకు ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. సభలో కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలు.. సభకు హాజరైన వారిని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సభతో తమ పార్టీ కొట్టిన ‘సిక్సర్’కు .. సీఎం కేసీఆర్ కు సౌండ్లు లేవంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు. ప్రత్యేక రాష్ట్రాన్నే ఇచ్చిన తమ అధినేత్రి.. ఇక రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఈ హమీలను ఎంత కష్టమైనా సరే కచ్చితంగా అమలు చేస్తారని అంటున్నారు. రాష్ట్ర ప్రజలకు సోనియాపై తెలంగాణ ఇచ్చిందన్న సానుభూతి ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం ఉందని.. అవే రాబోయే ఎన్నికల్లో తమను కచ్చితంగా గెలిపించి తీరుతాయని అంటున్నారు. గ్రూపు తగాదాలకు తమ పార్టీ అడ్డా అని విమర్శలు చేస్తున్న ఇతర పార్టీలకు.. ఈ బహిరంగ సభతో తమ ఏకైక లీడర్ సోనియా గాంధీనే అని, ఆమె చెప్పిందే తమకు వేదమనే విషయం స్పష్టమై ఉంటుందని అంటున్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పై కాస్త సానుకూలంగా ఉన్నట్లు నిన్న జరిగిన సమావేశంతో తెలుస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు హాజరయ్యారు. బస్సుల్లో.. కార్లల్లో.. వ్యాన్లలో.. జీపుల్లో.. కాలినడకన.. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన జనం.. కాంగ్రెస్ సభకు బ్రహ్మరథం పట్టారు. అగ్రనాయకులకు ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లోనే సోనియాను భారతమాతగా చిత్రించారు. కాంగ్రెస్‌ అంచనాలకు మించి వచ్చిన జనంతో.. సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సభలో సోనియా ప్రకటించిన హామీలకు ఫిదా అయ్యారు. ఒక్కొక్క హామీని ప్రకటిస్తుంటుంటే చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఏపీలో పార్టీని చంపుకుని మరీ తెలంగాణను ఇచ్చిన తమ దేవతను కచ్చితంగా గెలిపిస్తామని.. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తామని అంటున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు బీఆర్ఎస్‌కు అవకాశమిచ్చామని.. ఇప్పుడు సోనియమ్మకే మా ఓటు అని ముక్తకంఠంతో చెబుతున్నారు.

అయితే 50 ఏండ్ల పరిపాలనలో కాంగ్రెస్ కు ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర లేదనేది రాష్ట్రంలోని అధికార వర్గాల మాట. ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఇచ్చిన హామీల అమలు లేదని, అసలవి నెరవేర్చాలన్న సరైన వ్యూహం కూడా కాంగ్రెస్ కు లేదని అంటున్నారు. పచ్చబడ్డ రాష్ట్రంలో అచ్చంగా అధికారంలోకి రావాలని, మరోసారి దోపిడీ పర్వం మొదలుపెట్టాలనే ఆలోచన తప్ప.. తెలంగాణ ప్రజల భవిష్యత్‌పై చింతలేదని చెబుతున్నారు. కాంగ్రెస్‌ తమకు సాధ్యం కానీ హామీలు గుప్పించిందని అంటున్నారు.




Tags:    

Similar News