డబ్బులు పంచుతూ దొరికిపోయిన సీఐపై ఈసీ సస్పెన్షన్ వేటు

Update: 2023-11-29 04:47 GMT

ఎన్నికల వేళ కారులో డబ్బు తరలిస్తూ దొరికిపోయిన ఎక్సైజ్‌ సీఐ అంజిత్‌ రావు సస్పెండ్‌ చేస్తూ ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్‌లోని మేడిపల్లి మండలం చెంగిచర్లలో డబ్బుతో దొరికిపోయాడు అంజిత్‌ రావ్. దీంతో డబ్బుతో పాటుగా కారును కూడా అధికారులు సీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్లినందుకు అంజిత్‌ రావును సస్పెండ్‌ చేస్తున్నట్లుగా ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది.

నవంబర్ 27న మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల వద్ద ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారులోని సీఐని కిందకు దింపి చెక్ చేయగా ఓ బ్యాగులో ( 5 వందలు, 2 వందల)నోట్లకట్టలు కనిపించాయి. ఈ డబ్బులు ఓటర్లకు పంచేందుకే తీసుకువచ్చినట్లు అనుమానించిన కాంగ్రెస్ నాయకులు దాడిచేసారు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరు అతడి చెంప చెళ్లుమనిపించాడు. పోలీసు అయ్యి ఉండి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున డబ్బులు పంచుతున్నారన్న కోపంతో కాంగ్రెస్‌ నేతలు అంజిత్‌ రావును నిలదీశారు. వెంటనే సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు.. డబ్బును, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎక్సైజ్‌ అధికారి అంజిత్‌ రావును సస్పెండ్‌ చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

అయితే డబ్బులతో పట్టుబడిన వ్యక్తి వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి మల్లారెడ్డి కోసమే ఈ డబ్బులు తరలిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీస్ అయివుండి ఇలా ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కి డబ్బులు తరలించడం దారుణమని మండిపడుతున్నారు. ఎన్నికల కమీషన్ సదరు పోలీస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News