ఆన్ లైన్ గేమ్ ఓ నిండు ప్రాణాలను బలిగొంది. గేమ్ లో డబ్బులు పోయాయన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. నెక్కొండ మండలం అప్పలరావుపేటకు చెందిన బాషబోయిన ఉదయ్ (24).. శుక్రవారం రాత్రి (జూన్ 23) ఆన్ లైన్ గేమ్ లో రూ. 50వేలు పోగొట్టుకున్నాడు. ఇటీవలే ఉదయ్ తండ్రి ధాన్యం అమ్మిన డబ్బులు రూ. 50 వేలు.. అతని తల్లి బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యాయి. అయితే, ఉదయ్ ఆడిన ఫోన్ కి తన తల్లి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది. అది గమనించిన ఉదయ్.. ఆన్ లైన్ లో ఆ డబ్బులు పెట్టి దాన్ని డబుల్ చేయాలనుకున్నాడు. అంతే.. అదే గేమ్ లో రూ. 40వేలు పెట్టి పోగొట్టుకున్నారు. విషయం తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారని భావించిన ఉదయ్.. తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.