Bhatti Vikarmarka : తెలంగాణ బడ్జెట్.. కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా
రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందని భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. అందుకోసమే రైతు రుణమాఫీని ఎన్నికల హామీల్లో చేర్చినట్లు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు బీమా వంటి అంశాలపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లు త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ, విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని స్పష్టం చేశారు.
రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని భట్టి ప్రకటించారు. గతంలో కన్నా భిన్నంగా కౌలు రైతులకూ రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధుతో అనర్హులు, పెట్టుబడిదారులే బాగుపడ్డారని భట్టి ఆరోపించారు. కొండలు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న భట్టి.. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు వివరించారు.
అదే విధంగా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. విత్తన భాండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవకాశం ఉన్నా గత ప్రభుత్వ తీరుతో సాధించలేక పోయిందని తెలిపారు. కానీ తమ ప్రభుత్వం రైతులకు నష్టం చేసే విత్తన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.