ఎండలతో అల్లాడిన రాష్ట్ర ప్రజలకు వరుసగా కురుస్తున్న వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదకర వాతావరణంతో నగరవాసులు రిలాక్స్ అవుతుంటే.. పల్లెల్లో రైతన్నలు వ్యవసాయ పనులు మొదలెట్టారు. బం గాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈరోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు అధికారులు. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది
హైదరాబాద్‌లో ఇవాళ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. వర్షం సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.