Revanth Reddy : తెలంగాణలో కులగణ.. సర్కార్ సేకరించే వివరాలు ఇవేనా?

Byline :  Bharath
Update: 2024-02-17 02:54 GMT

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు దీనిపై చర్చ సాగింది. బీఆర్ఎస్ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తగా.. అన్నింటిని పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామని అధికార పార్టీ చెప్పింది. దీంతో ఈ తీర్మానానికి బీఆర్ఎస్ సైతం ఆమోదం తెలిపింది. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. దీనికి అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. ఏ ఫార్మాట్‌లో సర్వే నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో నిర్వహిస్తారు? ఏయే వివరాలను సేకరిస్తారు? ఎంత మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు? డెడ్‌లైన్ ఎప్పటి వరకు? అనే అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది. కులగణనపై జరిగిన చర్చలో.. దీన్ని చట్టబద్దం చేయాలని విపక్షాలు ప్రతిపాదిస్తున్నాయి. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటుచేస్తే లీగల్ చిక్కులు లేకుండా.. బీహార్ రాష్ట్రంలో వచ్చినట్లు ఇబ్బందులు రావని కొందరు నేతలు చెప్తున్న మాట.

కాగా కులగణన సర్వేలో ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ తదితర వివరాలతో పాటు.. ప్రజల వ్యక్తిగత, కుటుంబ వివరాలను కూడా సేకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో తెలిపారు. ఏ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఉపాధి అవకాశాలు ఏ మేరకున్నాయి? ప్రభుత్వం కల్పించాల్సిన అవసరాలు ఏంటి? అనే విషయాలు ఈ సర్వే ద్వారా తెలుస్తాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ‘సమగ్ర కుటుంబ సర్వే’ చేపట్టింది. దాంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే ఈ సర్వే ఏం భిన్నంగా ఉంటుందనే ఆసక్తి నెలకొన్నది. ఈ వివరాలతో ప్రభుత్వం ఏం చేస్తుంది. వెల్ఫేర్ స్కీంలకు ప్రామాణికంగా తీసుకుంటుందా..? అలా చేస్తే ప్రస్తుతం అర్హులుగా ఉన్న వాళ్లపై వేటు పడుతుందా..? ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో బిహార్, కర్నాటక రాష్ట్రాలు కూడా ఇలాంటి సర్వేనే జరిపాయి. 2015లో కర్నాటక ప్రభుత్వం సోషియో ఎకనమిక్ పేరుతో సర్వే నిర్వహించింది. 2023లో బిహార్ ప్రభుత్వం జనగణన పేరుతో సర్వే జరిపారు. వీటిలో కొన్ని సాధారణ అంశాలున్నా.. అవి వేర్వేరుగా ఉన్నాయి. కర్నాటకలో 55 ప్రశ్నలతో వివరాలు సేకరించగా.. బిహార్ లో 17 అంశాల ఆధారంగా సర్వే జరిపారు. ఈ సర్వేతో అర్హులైన వారి వివరాలను సేకరించి.. ప్రజాధనం వృధా కాకుండా చూశారు. అర్హులైన వారికే పథకాలు అందేలా చేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో కూడా అలాంటి అంశాలే అడిగి తెలుసుకున్నారు. అత్యధికంగా 94 ప్రశ్నలడిగి సర్వే చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేయబోయే సర్వే కూడా అలానే ఉండబోతుందా? ఈ సర్వే ఏ ఉద్దేశంతో చేయబోతున్నారు? అనే అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు.




Tags:    

Similar News