Delhi Liquor Scam : సీబీఐపై సుప్రీం ప్రశ్నల వర్షం.. వాళ్లను అన్యాయంగా ఇరికించారా..?

Byline :  Kiran
Update: 2023-10-05 13:41 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలపై ప్రశ్నల వర్షం కురిపించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాలసీని మార్చినంత మాత్రాన అక్రమాలు జరిగినట్లేనా అని ప్రశ్నించిన సుప్రీం.. కేసులో నిందితుడిగా ఉన్న వారి నేరాంగీకారం ఒక్కటే సరిపోదని చెప్పింది.

కేసు విచారణలో భాగంగా సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలున్నాయని సీబీఐను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థలు సమర్పించిన సాక్ష్యాధారాలు సరిగా లేవని అభిప్రాయపడింది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉండి అప్రూవర్గా మారిన బిజినెస్మేన్ దినేష్ అరోరా స్టేట్మెంట్ మినహా సిసోడియాకు వ్యతిరేకంగా ఇంకేవైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగింది.

కొందరు వ్యక్తులకు లబ్ది చేకూరేలా లిక్కర్ పాలసీ రూపొందించారని సీబీఐ కొన్ని వాట్సాప్ మెసేజ్లను సాక్ష్యంగా సమర్పించింది. అయితే వాటిపైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని సాక్ష్యాలుగా ఎలా పరిగణించాలని ప్రశ్నించింది. లిక్కర్ స్కాంతో సంబంధమున్న వారి నుంచి మనీష్ సిసోడియాకు నగదు ఎలా అందిందో చెప్పాలని న్యాయమూర్తులు దర్యాప్తు సంస్థలను అడిగారు. కేసులో నగదు ఎవరి నుంచి ఎవరికి ఎలా చేరిందన్న అంశంపై సాక్ష్యాల లింకులు స్పష్టంగా లేవని అభిప్రాయపడ్డారు.

కేసులో రూ.100కోట్లు, రూ.30 కోట్ల ప్రస్తావన ఉందని, ఆ మొత్తాలను ఎవరు చెల్లించారని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. చాలా మంది డబ్బులు చెల్లిస్తూ ఉంటారని, అలాంటప్పుడు అవి లిక్కర్ కేసుకు సంబంధించినవే అని చెప్పేందుకు సాక్ష్యాలేమైనా ఉన్నాయని నిలదీసింది. కేసులో నిందితుడిగా ఉండి ఆ తర్వాత అప్రూవర్గా మారిన దినేష్ అరోరా ప్రకటన తప్ప సరైన రుజువులు ఎక్కడున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ప్రశ్నించింది. లిక్కర్ లాబీ నుంచి నిందితుడికి డబ్బు అందిందన్న విషయాన్ని రుజువు చేయడం కష్టమే అయినా ఆ పని చేయాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు.

సీబీఐ సమర్పించిన సాక్ష్యాలపై సుప్రీం ధర్మాసనం ప్రశ్నలకు సీబీఐ వద్ద సమాధానం లేకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ అవినీతి జరిగిందని రుజువులు చూపకపోవడంతో అది వీగిపోయే అవకాశమే ఎక్కువని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ లెక్కన లిక్కర్ స్కాంలో తెలంగాణ ఆడబిడ్డను అన్యాయంగా ఇరికించారా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News