రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం.. భట్టి విక్రమార్క
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. మంత్రిగా అధికారం చేపట్టాక.. తొలిసారిగా నిన్న ఖమ్మం నగరానికి వచ్చిన భట్టి విక్రమార్క.. ఈ రోజు మధిర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. మధిర నియోజకవర్గం ప్రజల అండతోనే తాను ఉన్నతమైన పదవిని చేపట్టానని, చారిత్రక విజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన తెలిపారు.
ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై భట్టి తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన అంతా అస్తవ్యస్తమే అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందని దుయ్యబట్టారు. నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే పని చేసేలా చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను కేవలం రెండు రోజుల్లోనే ప్రారంభించామని భట్టి తెలిపారు. 100 రోజుల వ్యవధిలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. ఐటీ, పరిశ్రమలు, సేవా రంగాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రజా దర్బార్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదన్న బీఆర్ఎస్ పెద్దలకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.