Women Reservation Bill: ఈ బిల్లు సవర్ణ మహిళల కోసమే.. దీనికి మేం పూర్తి వ్యతిరేకం: ఓవైసీ

By :  Bharath
Update: 2023-09-20 15:17 GMT

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. మొత్తం 545 మంది ఎంపీలు ఉండగా అందులో 456 మంది సభకు హాజరయ్యారు. వాళ్లలో 454 మంది మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటేయగా.. మిగతా ఇద్దరు ఎంఐఎం ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. సభలో మాట్లాడిన అసదుద్దీన్.. ఈ బిల్లు కేవలం ‘సవర్ణ మహిళల’ (అగ్రకుల మహిళలు) కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా లేకపోవడంపై కేంద్ర తీరును తప్పుబట్టారు. ఎంఐఎం పార్టీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తుందని అన్నారు. మహిళా బిల్లును ‘చెక్ బౌన్స్ బిల్లు’, ‘ఓబీసీ, ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లుగా’ విమర్శించారు.

లోక్ సభలో సవర్ణ మహిళల ప్రాతినిధ్యం పెంచాలని చూస్తుంది. కేంద్రానికి ఓబీసీ, ముస్లిం మహిళలు అక్కర్లేదా అని దుయ్యబట్టారు. 17వ లోక్ సభ వరకు మొత్తం 690 మంది మహిళా ఎంపీలు ఎన్నికైతే.. అందులో కేవలం 25 మంది మాత్రమే ముస్లిం వర్గానికి చెందిన వాళ్లున్నారని చెప్పుకొచ్చారు. లోక్ సభలో కూడా హిందూ జాతీయ వాదాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇది సభలో ముస్లిం ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని అన్నారు.

తమ మతస్తులకు న్యాయం చేయని ఈ బిల్లు దండగ అన్నారు. ‘‘ముస్లిం మహిళలకు కోటా ఇవ్వకుండా బిల్లు తెస్తున్నారు. మా మహిళలకు ప్రాతినిధ్యంపై ఈ బిల్లులో ఎలాంటి ప్రస్తావనా లేదు..’’ అని అన్నారు. చట్టసభలో ప్రాతినిధ్యం లేనివారికి రిజర్వేషన్ కల్పించాలి. ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం లేదు కనుక వారికి కోటా ఇవ్వాలి. ఆ అంశం లేని ఈ బిల్లుల లోపభూయిష్టం. మేం దీన్ని వ్యతిరేకిస్తున్నామని అని స్పష్టం చేశారు.

కాగా, మహిళలకు 33 శాతం అని చెప్పిన కేంద్రం ఆయా సామాజిక వర్గాల్లోని మహిళలకు న్యాయం చేకూరేలా చూడాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కులాల ఆధారంగానూ కోటా ఉండాలని, లేకపోతే అగ్రవర్ణాల మహిళలే 33 శాతం సీట్లను కాజేస్తారని దళిత, బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News