లోక్ సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో మెజార్టీ స్థానాలు ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అనుసరించిన విధానాన్ని ఇప్పుడు అమలుచేస్తోంది. ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించి అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
రెండుసార్లు హ్యాండిచ్చిన కాంగ్రెస్
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్కు తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్నికలకు ముందు వరకు ఆయనకు టికెట్ కన్ఫామ్ అని ప్రచారం జరగడం, నామినేషన్ సమయానికి పార్టీ హైకమాండ్ మొండిచేయి చూపడం కామనైపోయింది. అభ్యర్థుల్ని ప్రకటించే సమయానికి కొత్త ముఖాలను తెరపైకి తెచ్చి అద్దంకిని సైడ్ చేయడం కాంగ్రెస్కు పరిపాటిగా మారింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అద్దంకి తుంగతుర్తి టికెట్ ఆశించారు. పార్టీ హైకమాండ్ తన సేవలను గుర్తించి తప్పక టికెట్ ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయితే ఎన్నికలకు కొన్నిరోజుల ముందు బీఆర్ఎస్ నుంచి మందుల సామెల్ కాంగ్రెస్లో చేరడం అద్దంకి ఆశలపై నీళ్లు చల్లింది. దయాకర్ కు హ్యాండిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ సామెల్కు ఆ టికెట్ కట్టబెట్టింది. పార్టీ నిర్ణయం నిరాశ కలిగించినా.. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించిన ఆయన.. మందుల సామేల్ తరఫున ప్రచారం చేసి ఆయన విజయంలో కీలకపాత్ర పోషించారు.
చివరి నిమిషంలో పక్కనబెట్టి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్దంకి దయాకర్ చేసిన త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని అంతా భావించారు. ఎమ్మెల్సీగా అయినా ఆయనకు అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అద్దంకికి ఊహించని షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించే వరకు బల్మూరి వెంకట్ తో పాటు దయాకర్ పేరు జోరుగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన పార్టీ హైకమాండ్.. ఆయన స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. హైకమాండ్ వరుసగా రెండోసారి షాకిచ్చినా.. అద్దంకి దయాకర్ మాత్రం పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించారు.
ఎంపీ టికెట్ దక్కేనా..?
తాజాగా లోక్సభ ఎన్నికల్లో అద్దంకి దయాకర్కు భువనగిరి టికెట్ ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఎంపీ స్థానాల్లో బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. అయితే ఈసారైనా దయాకర్కు టికెట్ దక్కుతుందా అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డికి అద్దంకి అత్యంత నమ్మకస్తుడు. అయినా ప్రతిసారి ఆయనకు అన్యాయమే జరుగుతుండటంపై అద్దంకి అనుచరులు, అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ను నమ్ముకోవడమే దయాకర్ చేసిన పాపమా అని ప్రశ్నిస్తున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కారణమా..?
ఇదిలా ఉంటే అద్దంకికి పార్టీలో సరైన ప్రాధాన్యం లభించకపోవడం వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్పై అద్దంకి దయాకర్ చేసిన పరుష వ్యాఖ్యలే ఆయన కొంపముంచాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ చండూరులో నిర్వహించిన సభలో పాల్గొన్న అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డి బ్రదర్స్ను టార్గెట్ చేశారు. అప్పట్లో బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్తో పాటు వెంకట్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకట్ రెడ్డిని ఉద్దేశించి పార్టీలో ఉంటే ఉండు.. పోతే పో.. అంటూ పరుషంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ఇప్పుడు పార్టీలో దయాకర్ కు ఎలాంటి పదవి దక్కకపోవడానికి కారణమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.
సీఎం మౌనం ఎందుకు..
అద్దంకి దయాకర్పై కక్షగట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు ఎలాంటి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనప్పటికీ దయాకర్కు ఎలాంటి పదవి ఎందుకు దక్కడంలేదని ఆయన అనుచరులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మాట సైతం చెల్లడం లేదా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒత్తిడికి సీఎం రేవంత్ తలొగ్గుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.