త్వరలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరిస్తాం: Bhatti Vikramarka

Update: 2024-01-23 04:47 GMT

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కౌన్సిల్ ప్రతినిధుల బృందంతో సచివాలయంలో భేటి అయ్యారు. సంపద సృష్టిస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని భట్టి చెప్పారు.రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేస్తూ ఆ కౌన్సిల్ బృందం నివేదిక ఇచ్చింది.

స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చారు. థేమ్స్ నది తరహాలో మూసీ పరీవాహకం అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. ధరణిపై సూచనలు, సలహాలను ఇస్తే కమిటీకి పంపించి పరిశీలిస్తామని తెలిపారు.

భవన నిర్మాణ అనుమతులకు 10 శాతం మార్ట్​గేజ్ విధానాన్ని ఎత్తి వేయాలని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని, జీఓ 50ని ఎత్తివేయాలని నరెడ్​కో బృందం ఉపముఖ్యమంత్రికి సూచించింది.లక్షలాది ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని నరెడ్కో బృందం తెలిపింది. టీఎస్ ఐపాస్ కింద రంగారెడ్డి జిల్లాలో సుమారు రెండేళ్లుగా అప్లికేషన్‌లు పెండింగ్​లో ఉండటంతో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. పర్యావరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు యూనిట్ ధర రూ.9 నుంచి రూ.14లకు పెంచారని గుర్తు చేశారు. ఆ ధర కాస్త తగ్గించాలని నరెడ్కో బృందం ఉపముఖ్యమంత్రిని కోరింది. రాష్ట్రంలో అనధికార లే-అవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్​ఆర్ఎస్​ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

Tags:    

Similar News