మద్యం ప్రియులకు ఈసీ షాకింగ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేయనున్నట్లు చెప్పింది. ఈ నెలాఖరులో వరుసగా మూడు రోజులు ‘డ్రై డే’గా పాటించనున్నారు. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నవంబర్ 28, 29, 30వ తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నారు. డిసెంబర్ 1న వైన్ షాపులు మళ్లీ తెరచుకోనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఓట్ల కౌంటింగ్ జరిగే డిసెంబర్ 3న సైతం వైన్ షాపులు బంద్ చేయనున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.